బొడ్రాయిబజార్ (సూర్యాపేట), ఏప్రిల్ 29: మతోన్మాద, దోపిడీ విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి లౌకికశక్తుల ఐక్యత అనివార్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అ న్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో శుక్రవారం రాత్రి మల్లు స్వరాజ్యం సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సం దర్భంగా అమృతోత్సవాలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ.. రాజ్యాంగాన్ని బలహీనపర్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాలను మోదీ ప్రభుత్వం ధ్వంసం చేసేందుకు కుట్ర పన్నుతున్నదని మండిపడ్డారు. దేశ సంపదను లూటీ చేస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నదని ధ్వజమెత్తా రు. దేశంలో నిరుద్యోగం, ధరలు, ఆకలి, పేదరికం పెరుగుతున్నాయని.. అదే సమయంలో కార్పొరేట్ శక్తుల ఆస్తులు కూడా పెరుగుతున్నాయని విమర్శించారు. ధర లు తగ్గించాలని అడిగితే రాష్ట్రాల్లో పన్నులు తగ్గించుకోవాలని మోదీ విచిత్రంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ట్యాక్స్‌లు పెంచింది కేంద్రమేనని, పెట్రోల్‌పై రూ.9 ఉన్న పన్నును రూ.25కు, డీజిల్‌పై రూ.3 ఉన్న ట్యాక్స్‌ను రూ.21కి పెంచారని గుర్తుచేశారు. గత మూడేండ్లలోనే కేంద్రం ట్యాక్స్‌ల రూపంలో రూ.8 లక్షల కోట్లు దండుకొన్నదని ఆరోపించారు.