కొండాపూర్, జనవరి 26 : రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ యత్నిస్తున్నదని సీపీఐఎం జాతీయ నాయకుడు ప్రకాశ్ కారత్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మత్కాపూర్లో కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి లేని లోటును తీర్చాల్సిన బాధ్యత పార్టీ నాయకులపై ఉందని చెప్పారు. రష్యా- ఉక్రెయిన్, ఇజ్రాయిల్- పాలస్తీనా దేశాల మధ్య యుద్ధాలు జరుగుతుండగా.. భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్నదని, పాలస్తీనాను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. దేశ సంపదలో 20శాతం అదానీ, అంబానీ, టాటా, బిర్లాల చేతుల్లో ఉండిపోయిందని చెప్పారు. రైతుల పోరాటాలతో వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ నల్లచట్ట్టాలను తేవాలని చూస్తున్నదని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీర భద్రం, కార్యర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు తదితరులు పాల్లొన్నారు.