Koonamneni |పదేండ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తూ హిందుత్వ మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం అదే హిందువుల అభ్యున్నతికి ఏమి చేసిందో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ అంటున్న బీజేపీ దేశంలో 99 శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల బతుకులను వినాశనం చేస్తూ, కేవలం ఒక శాతంగా ఉన్న కార్పొరేట్ శక్తులకు సంపద అంతా దోచిపెడుతోందని అగ్రహాం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూంభవన్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ కేంద్ర పాలకులకు హిందువులైనా, ఇతరులపైనా అభిమానం లేదన్నారు. కేవలం మతాలను, కులాలను అడ్డం పెట్టుకుని అధికారం చలాయించడమే వారి లక్ష్యం అన్నారు. బీజేపీ నేతలు చెబుతున్న రామరాజ్యం అంటేనే అందరిని సమానంగా చూడడమని కూనంనేని గుర్తు చేశారు. కానీ, బీజేపీ నేతలు చెబుతున్నదేమిటో, చేస్తున్నదేమిటో ప్రజలు గమనించాలని కోరారు. హిందువులంటే ప్రేమ అంటున్న నేతలు ఈ దేశంలో పేద హిందువుల అభ్యున్నతికి తీసుకున్న చర్యలు చెప్పాలని డిమాండ్ చేశారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రగతిశీల శక్తులు, లౌకిక పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏకమై రాజకీయంగా బీజేపీ బలాన్ని తగ్గించగలిగామని కూనంనేని తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన వైఖరి కారణంగా మళ్లీ బీజేపీ బలం పుంజుకున్నదని, ఇది ఈ దేశానికే అత్యంత ప్రమాదకరంగా మారనుందన్నారు. ఢిల్లీలో ఆప్ ఓటమితో బీజేపీ మరింత రెచ్చిపోయే అవకాశం లభించిందని, ఇందుకు ఇండియా కూటమికి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ, దాంతోపాటు ఇండియా కూటమిని కాదని ఒంటరిగానే బరిలోకి దిగుతామని మొండి వైఖరి అవలభించిన ఆప్ అధినేత కేజ్రీవాలే కారణమన్నారు. ఆప్ కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ఢిల్లీలో అధికారం కొల్పోయిందని, అదే కాంగ్రెస్ 6 శాతం ఓట్లు వచ్చాయని, ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే తప్పక మరో సారి ఆప్ అధికారం చేపట్టేదని తెలిపారు. అయితే, కేజ్రీవాల్ పై ఉన్న కేసులను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆయనను బెదిరింపులకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఉదారభావంతో వ్యవహరించి ఇండియా కూటమిని ఏకతాటిపై నడిపేలా చర్యలు తీసుకోవాలని కూనంనేని పేర్కొన్నారు. లేకపోతే బీజేపీ మరింత బలపడి దేశ ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారుతుందని తెలిపారు.
చిలూకూరి బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై రామరాజ్యం సంస్థ ముసుగు ధరించి దాడిచేయడం గర్హనీయమని కూనంనేని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వంటి సంస్థల ప్రేరణతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. దాడులకు పాల్పడినవారిని తక్షణమే గుర్తించి ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మావోయిస్టులనే పేరుతో ఈ దేశ ప్రజలపై యుద్దం ప్రకటించి వారిని అత్యంత కిరాతకంగా మట్టు పెడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించడం దుర్మార్గమని కూనంనేని అన్నారు. ఇది అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్దమని, దీనిపై అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని ఇందుకు కారణమైన కేంద్రమంత్రి అమిత్ శిక్షించాలని కోరారు. అదేవిధంగా సుప్రీంకోర్టు సైతం ఎన్ విచారణ నిర్వహించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజప్తి చేశారు. మావోయిస్టుల అన్ని చర్యలను తాము సమర్థించడంలేదని, ప్రజల కోసమని అడవి బాట పట్టి పోరాడుతున్న మావోయిస్టులు అసలు ఎందు కోసం చనిపోతున్నారో ప్రజలు కనీసం గుర్తించడంలేదని విషయాన్ని గుర్తించుకోవాలని హితువు పలికారు. ఈ దేశంలో విప్లవం ద్వారా రాజ్యాధికం వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవని, ఈ నేపథ్యంలో వారు పునరాలోచన చేసుకోవాలని సాంబశివరావు కోరారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి సిపిఐ ముందుకు సాగుతున్నా ప్రజా సమస్యలపై ఎప్పటికప్పడు తమ గళం వినిపిస్తూనే ఉంటామని కూనంనేని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తద్వారా ఆర్టీసీ కార్మికుల సమ్మెను నివారించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సంస్థ నిర్వహించాలని, ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వైఖరిపై ఆ పార్టీతో తమ పొత్తు ఆధారపడి ఉంటుందని కూనంనేని వెల్లడించారు. కాంగ్రెస్ కలిసి వస్తే ఆ పార్టీతో ముందుకు సాగుతామన్నారు. లేకపోతే సిపిఐకి బలం ఉన్న చోట్ల ఒంటరిగా పోటీ చేసేందుకు కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నామని తెలిపారు. ఇదే సమయంలో బీజేపీ మినహా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పట్టుభద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్ సీ ఎన్నికల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎంఎల్ సీ స్థానానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించామని సాంబశివరావు వెల్లడించారు. మిగిలిన టీచర్స్ ఎంఎల్ సీ స్థానాలకు సంబంధించి ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం నాయకులు చర్చలు జరుపుతున్నారని, చర్చల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
ప్రజాప్రతినిధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగాలేదని కూనంనేని అగ్రహాం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఫోన్ చేసినా, మంత్రులు కానీ, అధికారులు గానీ కనీసం సమాధానం ఇవ్వడంలేదన్నారు. ఆ సమయంలో వారు పనిలో ఉంటే ఆ తర్వాత అయినా కనీసం స్పందించడకపోవడం దారుణమన్నారు. కొందరు మంత్రులు కలిసేందుకు కూడా సమయం ఇవ్వడంలేదని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే తమ నిరసనను వ్యక్తంచేశామని, ఇకనైనా ప్రజాప్రతినిధులతో అధికారులు మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు.
రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నా, దాన్ని వివరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూనంనేని అభిప్రాయం పడ్డారు. రైతు రుణమాఫీకి సంబంధించి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంత కంటే ఎక్కువగా రుణం ఉన్న వారికి సైతం రూ.2 లక్షలలోపు మాఫీ చేసి ఉంటే ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు వచ్చి ఉండేదని, ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదో ఇప్పటికీ అర్థం కాలేదన్నారు. బీసీల రిజర్వేషన్లుకు సంబంధించి 42 శాతం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో ఉన్న 50 శాతం సీలింగ్ అధిగమించేందుకు న్యాయ పోరాటం చేయాలని సాంబశివరావు సూచించారు. కుల గణన సర్వే సక్రమంగా లేదని వివిధ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో గ్రామ సభలు పెట్టి మరోసారి పునసమీక్షించి సరిదిద్దాలని సాంబశివరావు సూచించారు.
అక్రమ వలసల పేరుతో అమెరికా ప్రభుత్వం భారత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న తీరు అత్యంత దుర్మార్గమని, దీనిని సిపిఐ తీవ్రంగా ఖండిస్తోందని కూనంనేని తెలిపారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నారని 104 మంది భారతీయులను అమానవీయంగా సంకెళ్లు వేసి, సైనిక విమానాల్లో దేశంలో వదలిపెడితే దీనిపై కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, ఈ ఘటనను ప్రధాని ఖండించకపోవడం దారుణమన్నారు. కనీసం దౌత్యవేత్తలకు నిరసన కూడా తెలపకపోగా, అమెరికా విధానాలు అంతేనని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ సమర్థించడం గర్హనీయమన్నారు. ఈ దేశంలో నెలకొన్న నిరుద్యోగం కారణంగా బతుకు దెరువు కోసం ఏజెంట్ల మాయమాటలు నమ్మి అప్పులు చేసి మరీ వలస వెళుతున్నారన్నారు. నిరుద్యోగులు మోసపోకుండా ఏజెంట్లను కట్టడి చేయాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారహితమని ఆయన విమర్శించారు.