CPI Koonamneni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్రలో సీబీఐ, ఈడీ, ఇతర నిఘా సంస్థలను, చివరికి న్యాయవ్యవస్థను ఉపయోగించుకోవాలని చూస్తున్నదని ఆయన విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన నయా హిట్లర్ ప్రభుత్వం భారత్‌లో ఎప్పుడూ లేదన్నారు. హైదరాబాద్ మగ్దూంభవన్‌లో మందాపవన్ అధ్యక్షతన రెండు రోజుల పాటు జరిగే సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో ఏ ఒక బీజేపీ నేతనైనా అవినీతి ఆరోపణలపై అరెస్టు చేశారా? అని నిలదీశారు. ఎవరినైనా చేస్తే చూపాలని సవాల్ చేశారు. మనీ ల్యాండరింగ్ ఇతర కేసుల్లో 51 మంది బీజేపీ ఎంపీలపై ఆరోపణలు వచ్చాయని, 78 మంది ఎంఎల్ఏలపై ఫిర్యాదులు వచ్చాయని, ఒకరిపైనైనా విచారణ జరిపారా? ఒకరినైనా అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు.
భారత్‌లో భారీగా అవినీతి కుంభకోణాలు జరుగుతున్నాయని కూనంనేని అన్నారు. గతంలో రూ.90 కోట్లు కూడా లేని భోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని కూలగొట్టి.. వీసీ సింగ్ అధికారంలోకి వచ్చారన్నారు. 2జీ స్పెక్ట్రం విధానాల మార్పైనా, దాన్ని కుంభకోణంగా బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు భారత్‌లో లక్షల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయని, ఆదానీ పేరుతో రూ.13లక్షల కోట్ల కుంభకోణం, విజయ్ మాల్య, లలిత్ మోడీ తదితరులు కుంభకోణాలు వచ్చినా, ఎవరిపై విచారణలు చేసి అరెస్టులు చేయడం లేదని మండిపడ్డారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ..పేదలను కొల్లగొట్టి పెద్దలకు మేలు చేసేలా ఉన్నదని విమర్శించారు. పేదలకు ఇచ్చే మొత్తం సబ్సిడీ కలుపుకొని రూ. 5 లక్షల కోట్లయితే, ఈ సారి దానిని రూ.3లక్షల కోట్లకు తగ్గించారని తెలిపారు. జీఎస్టీ 99 శాతం పేదలే కడతారని, వారు రూ. 18లక్షల కోట్లు జీఎస్టీ కింద కడితే ఇచ్చేది రూ.5లక్షల కోట్ల సబ్సిడీ మాత్రమేనని, అదే సంపన్నులకు కార్పొరేట్ పన్ను 30 శాతం నుండి 22 శాతానికి తగ్గించారని చెప్పారు. మొండి బకాయిల పేరుతో రూ.12లక్షల కోట్లు సంపన్నుల బకాయిలను రద్దు చేశారన్నారు.
గుజరాత్ మోడల్ అని ఇప్పటి వరకు ఊదరగొట్టి.. ఇప్పుడు యూపీ మోడల్ అంటున్నారని, యూపీ మోడల్ అంటే బుల్డోజర్ మోడల్ అని చెప్పారు. అక్కడ ఒక అవినీతి పరుని ఇంటిపై బుల్డోజర్ ఎక్కలేదని, దళితులు, మైనారిటీలు, ప్రశ్నించే వారి ఇంటి మీదకే బుల్డోజర్ వెళ్తుందన్నారు. నరేంద్ర మోదీ బైటకు కన్నీళ్ళు కార్చినా, లోపల హృదయం పాషాణమని విమర్శించారు. మోడీకి చిత్త శుద్ది ఉంటే గీతాముఖర్జీ కమిటీ సిఫార్సుచేసిన మేరకు చట్ట సభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో మంచి వాటిని సమర్ధిస్తున్నామన్నారు.
ప్రతిపక్షాలలో చీలిక తీసుకువచ్చేందుకే మోడీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా విమర్శించారు. ప్రతిపక్షాలు ఏకమైతే తాము గెలవలేమని భయంతోనే చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.2024 లోక్ సభ సాధారణ ఎన్నికలు జరిగే లోపు తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.అందువల్ల ప్రతిపక్ష పార్టీలు ఏకమైతే ఎన్నికలలో గెలవలేమని కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రయోగిస్తున్నారన్నారు. మోదీ హయాంలో ధరలు విపరీతంగా పెంచేస్తున్నారని, ఇటీవల గ్యాస్, పెట్రోలు ధరలు భారీగా పెరిగాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు.