సారపాక, ఫిబ్రవరి 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ నంనేని సాంబశివరావు మండిపడ్డారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని వాసవీనగర్ గిరిజన భవన్లో సరెడ్డి పుల్లారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పినపాక నియోజకవర్గ జనరల్‌బాడీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నదని విమర్శించారు. నిత్యావసరాల ధరలపై సర్కారు నియంత్రణ లేక సామాన్య, పేద, మధ్యతరగతి ప్రజలు ఉప్పు, పప్పు, నూనె కొనుక్కుని జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.60 ఉన్న పెట్రోల్ రూ.115, రూ. 400 ఉన్న వంటగ్యాస్ రూ.1150కు చేరుకున్నదని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కి కార్పొరేట్‌కు అనుకూలంగా కొత్త చట్టాలను తీసుకొస్తున్నదని, చివరకు లాభాల్లో ఉన్న బొగ్గు బావులను కూడా ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నదని ధ్వజమెత్తారు. సీపీఐ నిత్యం పేదలకు అండగా ఉంటూ ఎర్రజెండా నీడలో పోరాటాలు చేస్తున్నదని తెలిపారు. పేదలను వదిలి పెద్దలకు కొమ్ముకాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సమరశంఖం పూరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ సీనియర్ నాయకుడు పాకాలపాటి వెంకటేశ్వరరావు(పెద్దబ్బాయి), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బీ అయో ధ్య తదితరులు పాల్గొన్నారు.