Koonamneni | వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 మేరకు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. పేద ప్రజలను దోపిడి చేసి, తన కార్పొరేట్ మిత్రులకు దోచిపెడుతున్న ప్రధాని నరేంద్రమోదీ జాతికి క్షమాపణ చెప్పాలని, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెంటనే రాజీనామా చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. పెరుగుతున్న క్రూడాయిల్ ధరకు అనుగుణంగానే దేశీయంగా చమురు ధరలు పెంచుతున్నట్లు నరేంద్రమోదీ చెబుతున్నారన్నారు.
నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ ధర 98 డాలర్లు ఉంటే దేశీయ మార్కెట్లో లీటర్ పెట్రోల్ రూ.66, డీజిల్ రూ. 50, గ్యాస్ సిలిండర్ రూ. 410 ఉన్నదని కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ ఇప్పుడు బ్యారెల్ క్రూడాయిల్ 82.5 డాలర్లు పలుకుతుంటే గ్యాస్ సిలిండర్ ధర రూ. 1155, లీటర్ పెట్రోల్ రూ.109, లీటర్ డీజిల్ రూ. 97 ఉన్నదన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంలో పరమార్థం ప్రధాని నరేంద్రమోదీకే తెలియాలని అన్నారు.
పెట్రోలియం మీద ఇచ్చే సబ్సిడీలు గతంలో రూ. 9170 కోట్లు వుంటే, ఈ ఏడాది దాన్ని రూ. 2257 కోట్లకు తగ్గించారని కూనంనేని ఆరోపించారు. ఎరువులపై సబ్సిడీ గతంలో రూ. 2,25,200 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ. 1.75 లక్షల కోట్లకు తగ్గించారన్నారు. ఆహార ధాన్యాలపై సబ్సిడీ రూ. 2.87 లక్షల కోట్ల నుంచి రూ. 1,97,350 కోట్లకు తగ్గించారని చెప్పారు. మొత్తం సబ్సిడీలను క్రమేపీ ఎత్తేసే కుట్రలను మోదీ సర్కార్ చేస్తున్నదన్నారు.
మొత్తం ఆర్థిక వ్యవస్థలో రూ. 3 లక్షల కోట్లు మాత్రమే సబ్సిడీలు ఉన్నాయని కూనంనేని అన్నారు. కానీ ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం ప్రతియేటా రూ.2 లక్షల కోట్ల మేర రాయితీల రూపంలో పన్నులు తగ్గించారన్నారు. అలాగే మొండి బకాయిల పేరుతో వివిధ బ్యాంకుల నుంచి కార్పొరేట్లు తీసుకున్న రుణాల్లో రూ.11 లక్షల కోట్లు రద్దు చేశారన్నారు.
గతంలో ఏనాడూ లేని విధంగా డాలర్ విలువ రూ.82లకు పతనం కావడంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నదని కూనంనేని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంక లాంటి పరిస్థితులు దేశంలో తలెత్తుతున్నాయని అన్నారు. అదానీ లాంటి వారికి సందను దోచిపెడుతున్న నరేంద్రమోదీ జాతికి క్షమాపణ చెప్పాలని, నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా రాజీనామా చేయాలన్నారు. గ్యాస్ సిలెండర్ పెంపుదలకు నిరసనగా రెండు రోజులు అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాలలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూనంనేని తెలిపారు.