జవహర్‌నగర్, నవంబర్ 30: సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బాలమల్లేశ్ శనివారం హైదరాబాద్‌లో ఆకస్మికంగా మృతి చెందారు. గుండెపోటుకు గురైన బాలమల్లేశ్ ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కలకొండ కాంతయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన వయస్సు 58 కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలమల్లేశ్ యాదవ్ చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితుడయ్యాడు. విద్యార్థి నేతగా, ఆపై పార్టీ నాయకుడిగా పనిచేశారు. పేద ప్రజలు నివసించే జవహర్‌నగర్‌తో బాలమల్లేశ్కు విడదీయలేని బంధం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని మగ్ధూంభవన్‌లో ఉంచుతామని, అనంతరం ఆదివారం యాప్రాల్‌లోని తన నివాసం నుంచి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. బాలమల్లేశ్ మృతికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్యే కూనంనేని తదితరులు సంతాపం తెలిపారు.