ఏపీలో రైతుల సంక్షేమం, వ్యవసాయానికి ప్రాధాన్యమివ్వకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా అవసరం లేని బనకచర్ల ప్రాజెక్టును చంద్రబాబు ముందుకు తెస్తున్నరు.
-సీపీఐ నారాయణ
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌లో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యమివ్వకుండా, పెండింగ్‌లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులను పట్టించుకోకుండా అవసరం లేని బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ మండిపడ్డారు. బనకచర్ల ప్రాజెక్టు ప్రతిపాదన వెనుక ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్రలు దాగి ఉన్నాయని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. గురువారం ఆయన తిరుపతి బైరాగిపట్టెడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుకు గురించి ఎన్డీఏ కూటమి తన ఎన్నికల హామీల్లో గానీ, మ్యానిఫెస్టోలో గానీ ఎక్కడా ప్రస్తావించలేదని గుర్తుచేశారు.
ఏపీలో పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు అనుసంధాన కాలువ, పోతిరెడ్డిపాడు లాంటి కీలక ప్రాజెక్టులను విస్మరించి బనకచర్ల ప్రాజెక్టుపై దృష్టి సారించడం వెనుక ఉన్న మర్మం ఏమిటని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి మేలు జరగదని ఆయన పేర్కొంటూ.. కేవలం కాంట్రాక్టర్లు, కార్పొరేట్ సంస్థల కమీషన్ల కోసమే ప్రాజెక్టును ముందుకు తెస్తున్నారని ఆరోపించారు.
బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కావేరీ బేసిన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం తెలంగాణతోపాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోక తప్పదని నారాయణ హెచ్చరించారు. ఇప్పటికైనా బనకచర్ల ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని, ఏపీలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.