హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఇంధన ధరలు పెంచి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని వేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత శుక్రవారం పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ.3 పెంచి, వారం రోజుల వ్యవధిలోనే మూడుసార్లు ఆయిల్ ధరలు రూ.4.80 పెంచి ప్రజలపై తీవ్ర భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోడీ పాలనలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విత్తనాలు, ఎరువులు ధరలు పెరిగి ప్రజలంతా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్ల కాలంలో రూపాయి విలువ పడిపోయిందని, దేశం అప్పులపాలైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి మంగళం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. దాని పర్యవసానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీకి కోట్ల మంది మద్దతు ప్రకటిస్తున్నారని వెల్లడించారు. దీనికి కారణం కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలేనని రామకృష్ణ వ్యాఖ్యానించారు.