నయీంనగర్, ఏప్రిల్ 5: దేశంలో అన్ని వర్గాల ప్రజలను దోచుకొని కార్పొరేట్లకు మాత్రమే లాభం చే కూర్చుతున్న ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ పార్లమెంటరీ పార్టీ నేత బినోయ్ విశ్వం అన్నారు. బుధవారం హనుమకొండలోని కుడా మైదానంలో సీపీఐ ప్రజాపోరు యాత్ర ముగింపు సభలో ఆయన మా ట్లాడారు. వరంగల్ అంటేనే పోరాటాల గడ్డ అని, దేశానికి, రాష్ర్టానికి ఈ గడ్డ ఆదర్శంగా ఉందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం దేశంలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. బీజేపీ విధానాలను ప్రశ్నించిన వారిపై ఈడీతో దాడులు చేయిస్తూ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ వల్లే ఆదానీ ఆస్తులు అమాంతం పెరిగాయని చెప్పారు.
బీజేపీది నీతి కలిగిన ప్రభుత్వం అయితే.. అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో బీజేపీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ విభజన హామీలు నెరవేర్చకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని విమర్శించారు. అందుకే బీజేపీని దేశం నుంచి పారదోలేందుకే ‘బీజేపీ హటావో.. దేశ్ బచావో’ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.