హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ రాష్ర్టానికి మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు? ముందు ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాతే కేరళ సహా ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడాలి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి అక్కడి ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై, అక్కడి సీఎం విజయన్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఉద్యోగాలనే భర్తీచేశారు తప్ప.. కొత్తగా మీరిచ్చిందేమీ లేదని తేల్చి చెప్పారు. కల్యాణలక్ష్మీ పేరుతో తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ సంస్థను విలీనం చేస్తామన్న హామీని అటకెక్కించారని మండిపడ్డారు.
రైతులకిచ్చిన రూ.రెండు లక్షల రుణమాఫీ హామీని కొంతమందికే అమలు చేసి చేతులెత్తేసిందని, రైతుభరోసా పేరుతో ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్న హామీని కనీసం సొంతజిల్లా అయిన మహబూబ్‌నగర్‌లో కూడా అమలు చేయలేదని విమర్శించారు. కౌలు రైతుల గురించి అసలు పట్టించుకోవడమే లేదని, ఆసరా పింఛన్ సొమ్మును రెండింతలు చేస్తామన్న హామీని నెరవేర్చలేదని తెలిపారు. యువవికాసం పేరుతో ఇస్తామన్న రుణసాయం ఇవ్వలేదని, మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న హామీ ఊసేలేదని చెప్పారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉద్యమకారులకు 200 గజాల చొప్పున స్థలం హామీలు అమలే కాలేదని మండిపడ్డారు. సొంత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాని సీఎం రేవంత్‌రెడ్డి.. కేరళ రాష్ట్రం వెళ్లి తెలంగాణలో ఏవేవో అద్భుతాలు జరిగినట్టుగా అసత్యాలు వల్లె వేయడం గర్హనీయమని పేర్కొన్నారు. తెలంగాణలో రేవంత్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఎకడ అమలు జరిగాయో చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.