ఇబ్రహీంపట్నం, మే 7: పేద ప్రజల సొమ్మును దోచుకుంటూ.. అదానీ, అంబానీలకు పంచిపెడుతున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు విశ్రమించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం రాత్రి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ చౌరస్తాలో ‘బీజేపీకో హటావో.. దేశ్‌కు బచావో’ నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో నిత్యావసర వస్తువులతోపాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి పేదలను దోచి పెద్దల కడుపు నింపుతున్నదని మండిపడ్డారు. కర్ణాటకలో ఓడిపోతామన్న భయంతో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.