న్యూఢిల్లీ, మే 20 (నమస్తే, తెలంగాణ): దేశవ్యాప్తంగా గవర్నర్లు తమ అధికార పరిధిని అతిక్రమించి ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. అసలు మన దేశంలో గవర్నర్ల వ్యవస్థే అవసరం లేదని పేర్కొన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ..ఢిల్లీలో అధికార పంపిణీపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టమైన తీర్పును ఇస్తే, కేంద్రంలోని మోదీ సర్కారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానిని పక్కనబెట్టడం దుర్మార్గమైన చర్య అని నిప్పులు చెరిగారు.
తెలంగాణలో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ క్లియర్ చేయకుండా జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ర్టాలకు మోదీ ప్రభుత్వం తీరని అన్యాయం చేయడంతోపాటు వాటిపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నదని సీపీఐ తెలంగాణ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.