హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను అడ్డం పెట్టుకొని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ ఆరోపించారు. కేంద్ర సంస్థలు తమ నిజాయితీని నిరూపించుకొనేందుకు ఇకపై ఎక్కడ దాడులు చేసినా.. ఆ ఉదంతం మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు. అప్పుడు సోదాల సమయంలో ఏం జరుగుతున్నదో ప్రజలందరికీ తెలుస్తుందన్నారు.
లేకపోతే ఆ సోదాలను కక్షసాధింపుగానే భావించాల్సి వస్తుందని అన్నారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంఓ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని ప్రశ్నించే పార్టీలు, వ్యక్తులు, సంస్థలపై ఐటీ, ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నదని ఆరోపించారు. తాను రిషికొండను సందర్శించకుండా ఆంక్షలు పెడుతున్నారని నారాయణ ఆరోపించారు. కోర్టు అనుమతితో తాను శుక్రవారం రిషికొండ వెళ్తున్నానని తెలిపారు.