హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ హయాంలో హెచ్సీయూకు భూములు కేటాయించినట్టు గుర్తుచేశారు.
రాజశేఖర్రెడ్డి సీఎగా ఉన్నప్పుడు కేర్ యాజమాన్యం దవాఖాన కోసం సహకరించాలని కోరిందని చెప్పారు. ఆ భూములను విద్యా ప్రయోజనాలకే ఉపయోగించాలని తాము డిమాండ్ చేసినట్టు గుర్తుచేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదంతో లౌకిక వ్యవస్థకు చీకటి రోజులు వచ్చాయని, దీంతో మతఘర్షణలు తలెత్తే అవకాశం ఉన్నదని కే నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు.