CPI Narayana | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చే జలగలాంటిదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ ఆరోపించారు. కేంద్రం విధిస్తున్న మోయలేని పన్నుల భారాలతో ప్రజలు విలవిలలాడుతున్నారని సీపీఐ జాతీయ అన్నారు. ప్రధాని మోదీ పాలనలో భారతదేశం క్రమంగా దిగజారుతున్నదని, పేదరికం, నిరుద్యోగం, అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజా వ్యతరేక నిరంకుశ విధానాలకు పాల్పడుతున్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కోరుతూ బీజేపీ హటావ్-దేశ్ బచావ్ నినాదంతో హైదరాబాద్, పంజాగుట్ట, నాగార్జున సరిల్, బంజారా హిల్స్ ప్రాంతాల్లో మంగళవారం సీపీఐ పాదయాత్ర నిర్వహించింది. ఈ పాదయాత్రలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్ ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొన్న పార్టీ శ్రేణులు వ్యాపార సముదాయాలు తిరిగి కరపత్రాలు పంచుతూ.. బీజేపీ ప్రజా వ్యతరేక విధానాలను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా డాక్టర్ కే నారాయణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో అదానీ, అంబానీ లాంటి కొంతమంది పెట్టుబడిదారుల లాభాలు గణనీయంగా పెరిగాయన్నారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు నిండా మునిగిపోతున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా లక్షలాది మంది జీవనోపాధిని కోల్పోతున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం వైపు పయనిస్తుందని తెలిపారు.
ఇంధన, నిత్యావసర వస్తువులు, ఔషదాలు ధరలు భారీగా పెరిగి సామాన్య ప్రజలు జీవించలేని స్థితిలోకి నెట్టుతున్నాయని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ద్వంసం చేస్తుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రతి వాగ్దానం మోసపూరితమైనదే అన్నారు. బీజేపీ, మోదీ మోసాలకు వచ్చే ఎన్నికల్లో ఓడించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బీ స్టాలిన్, రాష్ట్ర సమితి సభ్యులు బీ వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, నేతలు ఆరుట్ల రాజ్ కుమార్, శక్రి భాయ్, చెతన్య యాదవ్, బాలకృష్ణ, బీ రాజుగౌడ్, కళ్యాణ్, ఎండీ అహ్మద్,అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.