హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): బంగ్లాదేశ్ పరిణామాలు భారత ప్రధాని మోదీకి గుణపాఠం కావాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని కామెంట్ చేశారు. ముస్లిం మైనార్టీలు, వారికి సంబంధించిన హక్కులను కాలరాసేందుకు ఎన్డీఏ సర్కార్ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని స్పష్టంచేశారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది అప్పు మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏపీ మాజీ సీఎం జగన్ చేపట్టిన ధర్నా అట్టర్‌ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన రెండు నెలల్లోనే రాష్ట్రపతి పాలన కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.