న్యూఢిల్లీ, మే 30 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులను చంపినంత మాత్రాన వారి సిద్ధాంతం చావదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అన్నా రు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మా వోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించకుండా ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించడం తప్పు అని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో నారాయణ మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టు సిద్ధాంతం సామాజిక అసమానతలు, ఆర్థిక వివక్ష, అణచివేత నుంచి ఉద్భవించిందని చెప్పారు. ఆ సమస్యలు పరిష్కారం కాకపోతే, ఆ సిద్ధాంతం జనంలో జీవించి ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వం మావోయిస్టుల ఉద్యమాన్ని కేవలం శాంతిభద్రతల సమస్యగా చూడకుండా, సామాజిక, ఆర్థిక కారణాలను అర్థంచేసుకొని పరిష్కరించాలని సూచించారు. నక్సల్స్ఫ్రీ ఇండియా అని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా జబ్బలు చర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులకు మధ్య కేంద్రప్రభుత్వానికి తేడా తెలియదని విమర్శించారు. నక్సలైట్లు సమాజం కోసం పోరాడుతారని చెప్పారు. అటవీ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం కోసం అక్కడ నివసిస్తున్న గిరిజనులను ఖాళీ చేయించాలని కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. నక్సలైట్లు ఉంటే అది సాధ్యంకాదనే కారణంతోనే వారిని చంపుతున్నారని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పదేపదే ఢిల్లీకి పిలిపించుకోవడం సరికాదని, సీఎంకు కాంగ్రెస్ అధిష్ఠానం స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. ప్రతిసారి పగ్గాలు పట్టి వెనుకకు లాగడం రాష్ర్టానికి, పార్టీకి ప్రయోజనకరం కాదని నారాయణ అభిప్రాయం వ్యక్తంచేశారు.