హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: హైడ్రాను రాజకీయ కక్ష సాధింపు చర్యలకు సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించొద్దని, పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ సూచించారు. సినీ నటుడు నాగార్జున తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆరోపించారు. నేలమట్టమైన ఎన్ కన్వెన్షన్ స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నట్టు నారాయణ చెప్పారు.
వందల కోట్ల సంపాదన ఉన్న ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జునకు కక్కుర్తి ఎందుకని నారాయణ ప్రశ్నించారు. చెరువు ఎఫ్టీఎల్లో ఫంక్షన్ హాలు కట్టడమేమిటని ప్రశ్నించారు. చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్లో సంపాదించిన డబ్బును, నష్టపరహారంతోసహా కక్కించాలని, అలా వచ్చిన సొమ్ముతో పేదలకు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. ఆయన వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, సభ్యులు పర్వతాలు, శేరిలింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, చందుయాదవ్, వెంకట్స్వామి తదితరులు ఉన్నారు.