హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండా పొత్తుల అంశంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పుపట్టారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ కోరుతున్నట్టుగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే, చివరకు వైసీపీకే లాభం చేకూరుతుందని తేల్చిచెప్పారు.
బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని, మళ్లీ జగనే విజయం సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కూటమి అధికారంలోకి వచ్చినా రాష్ర్టానికి ఎలాంటి లాభం ఉండదని చెప్పారు. గవర్నర్ వ్యవస్థకు అనుకూలంగా కేంద్రం తెచ్చే ఆర్డినెన్సుకు రాజ్యసభలో మద్దతు కోసమే బీజేపీ వివేకా కేసులో సహకరిస్తున్నదని ఆరోపించారు. అవినాశ్ అరెస్టు లాంటి ఘటన తమిళనాడు, కర్ణాటక, కేరళలో జరిగితే కేంద్ర బలగాలు దింపి అరెస్టులు చేసేవారని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ ఉత్సవ విగ్రహంగా ఉందని ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసులో ఆలస్యానికి లోపాయికారి ఒప్పందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు బీజేపీ, రెండో శత్రువు వైసీపీ అని విమర్శించారు. రెండు వేల నోట్లను రద్దు చేసి, మోదీ లీగల్‌గా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని నారాయణ ఆరోపించారు.