Narayana | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి అందాల పోటీలు నిర్వహించడం అత్యంత బాధాకరమని, పవిత్రమైన స్త్రీ జన్మను అవమానపరిచే విధంగా నిర్వహించే అందాల పోటీలను వ్యతిరేకించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో నారాయణ మేనకోడలు కావేరి ఫుడ్ ప్రొడక్ట్ షాపు ప్రారంభోత్సవానికి హాజరై షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. మా మేనకోడలు సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి పదిమందికి సేవ చేయాలని సంకల్పంతో స్వయం ఉపాధిని ఎంచుకోవడం జరిగిందన్నారు. పదిమందికి జీవనాధారం కల్పించడానికి ప్రయత్నించడం చాలా సంతోషంగా ఉందన్నారు. సింగపూర్ నుంచి వచ్చి స్వశక్తితో ఎదగాలనే ఆలోచన స్త్రీ జాతి అందరికీ ఆదర్శం అన్నారు. కానీ హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్త్రీ జాతిని అవమాన పరుస్తూ అందాల పోటీలు నిర్వహించడం చూస్తుంటే ఆడవాళ్లను బజారులో పెట్టి అమ్మే పద్ధతిలో ఉందన్నారు. అందాల పోటీలు అంటే అర్థం ఏంది స్త్రీ జాతిని నడిరోడ్డులో పెట్టి వేలం వేయడమా? అది పద్ధతి కాదు బతకడం అంటే స్వయం శక్తితో బతకాలని.. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు స్త్రీలకు స్వేచ్ఛను అందించాలని సూచించారు. అందాల పోటీలు నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి లేదని గొప్పగా 25 కోట్లు ఖర్చు పెడుతున్నానని చెప్పడం అత్యంత పవిత్రమైన స్త్రీ జాతిని మరింత అవమానించడమేనన్నారు. నా మేనకోడలు పావని కూడా అందాల పోటీలు పెడితే ఫస్ట్ వస్తుందని చలోక్తి విసిరారు. అలా కాకుండా ఇలా స్వయం శక్తితో బతకాలని బతకడానికి ముందుకు వచ్చిన తన మేనకోడలు పావనిని అభినందించారు. ఈ సమావేశంలో కావేరి ఫుడ్ ప్రోడక్ట్ యండి పావని, సునీల్ పాల్గొన్నారు.