Kunamneni Sambasiva Rao | హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ): శాసనసభలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో రైతులకు రుణమాఫీ కాలేదని బీఆర్ఎస్ చెప్తున్నది. అయితే శుక్రవారం సభలో రుణమాఫీ క్షేత్రస్థాయి పరిస్థితిని వివరిస్తూ కూనంనేని ఓ గ్రామాన్ని ఉదహరించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ముదిగొండ గ్రామంలో 554 మంది రైతుల్లో కేవలం ఇద్దరికి మాత్రమే రుణమాఫీ జరిగిందని చెప్పారు.
అధికారులు చిన్నచిన్న సాకులు చూపుతూ రుణమాఫీ చేయలేదని తెలిపారు. ఆధార్‌కార్డుల ఎంట్రీని తప్పుగా చూపి, ఇంతమందికి అన్యాయం చేశారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. తప్పులను సరిచేయాలని కోరారు. ఇక రూ.2లక్షల కు పైగా రుణాలు ఉన్నవాళ్ల సంగతి చెప్పాల్సిన అవసరం లేదని వాపోయారు. అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందికి 5 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, వెంటనే చెల్లించాలని కోరారు.