Operation Kagar | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ కగార్ పేరుతో ఎంత మంది మావోయిస్టులను చంపుతారు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు ప్రశ్నించారు. దీనిపై కేంద్రం పాలసీ ఏంటో స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కేంద్ర బలగాలతో రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ కగార్‌లో పాల్గొన్నారని.. ఆపరేషన్ కగార్‌పై రాష్ట్ర ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలన్నారు. కేంద్రానికి మావోయిస్టులు మీద ఉన్న కోపం, కసి ఉగ్రవాదుల మీద లేదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని దేశమంతా గగ్గోలు పెడుతుందన్నారు. ఉగ్రవాదులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు? ఉగ్రవాదుల కంటే మావోయిస్టులు అత్యంత ప్రమాదకరమా కేంద్రం చెప్పాలని కూనంనేని సాంబశివరావు నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతుందని, కొత్త సంక్షేమ పథకాల వల్ల ప్రయోజనం కొంతమందికి చేకూరుతున్నా.. పాత సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. పాత సంక్షేమ పథకాలు అరకొర అమలు చేయడం వల్ల ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. నన్ను కోసిన డబ్బులు లేవన్న ముఖ్యమంత్రి కొత్త పథకాలు ఎందుకు పెడుతున్నారు అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్కు తాము వ్యతిరేకమని కూనంనేని సాంబశివరావు అన్నారు.