హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): ‘కేరళ సీఎం పినరయ్ విజయన్ను ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఎలా పోలుస్తరు? ఆయన వ్యాఖ్యలు ఇండియా కూటమికే నష్టం వాటిల్లేలా ఉన్నది. అది బీజేపీకే లాభం ’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి నరసింహతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూనంనేని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
రేవంత్ వ్యాఖ్యలు బీజేపీకి లాభం చేకూర్చడమే అవుతుందని పేర్కొన్నారు. అకడి ప్రభుత్వంలో తప్పులుంటే వాటిని ఎత్తి చూపడంలో తప్పులేదని, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సరైంది కాదని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్ ప్రజల మధ్య అసమానతలు పెంచేలా ఉన్నదని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు మరిన్ని రోజులు జరిపితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మేధావులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లుగా ముద్ర వేస్తూ, వేధింపులకు గురిచేస్తుందని ధ్వజమెత్తారు. పార్లమెంట్ స్థానాల పునర్వ్యవస్థీకరణను ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇంటింటికి సీపీఐ’ పేరుతో ఈ నెల 15 వరకు ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నట్టు కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ సమయంలో ప్రజల నుంచి విరాళాలను సైతం సేకరించనున్నట్టు చెప్పారు. కాంగ్రెస్తో రాజకీయంగా స్నేహబంధం ఉన్నప్పటికీ ప్రజాసమస్యలపై ఎకడా రాజీ పడబోమని స్పష్టంచేశారు.