హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో శనివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లుగా హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాని పర్యటన సందర్భంగా శుక్ర, శనివారాల్లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు తెలుపనున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ మగ్దూంభవన్‌లో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనందుకు వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఈనెల శుక్రవారం, బయ్యారం ఉకు కర్మాగారం చేపట్టనందుకు కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో, గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయనందుకు ములుగు జిల్లాలో శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు.