ఖమ్మం, జనవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): పేదవాడు బతికే అవకాశం లేకుండా నిత్యావసరాల ధరలను పెంచడంతోపాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టుల ఖిల్లా అని, వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి 10 సీట్లూ గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశం బాగు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్కు జాతీయ పార్టీగా గుర్తింపు తీసుకొచ్చారని, రానున్న రోజుల్లో బీజేపీకి బుద్ధి చెప్పడానికి తాము కేసీఆర్‌కే మద్దతిస్తామని పునరుద్ఘాటించారు. తమ పార్టీ ఎజెండాలోని అంశాలనూ వారు పరిగణనలోకి తీసుకోవడం నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన మతతత్వ బీజేపీ.. గడిచిన ఎనిమిదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఉద్యమిస్తే 750 మందిని పొట్టన పెట్టుకున్నదని విమర్శించారు. సింగరేణి, ఎల్ఐసీ సహా ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేసిందని ఆరోపించారు. అన్నిరంగాలను వెనుకబాటుకు గురిచేసిన చరిత్ర బీజేపీదేనని విమర్శించారు. చివరికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధ్వజమెత్తారు. అందుకే తెలంగాణలో ఉన్న పథకాలను దేశమంతా ప్రవేశపెట్టడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ముందుకొచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల సత్తా చాటుతామని, సీట్లు, ఓట్లే ముఖ్యం కాదని కూనంనేని చెప్పారు.