హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా తమకు రుచించని వార్తలు ప్రసారం చేసిన అంతర్జాతీయ మీడి యా సంస్థలపై కూడా తమ సంస్థలతో దాడులు చేయించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో గోద్రా ఘటన అంశాలపై డాక్యుమెంటరీని విడుదల చేసిన బీబీసీ భారత కార్యాలయాలపై ఐటీ సోదాలు చేయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వా మ్యం, భావప్రకటనాస్వేచ్ఛకు నిలయమైన భారతదేశంలో మీడియా గొంతు నొక్కుతారా? దేశ ప్రతిష్టను మంటగల్పుతారా? అని నిలదీశారు.
ఎస్బీఐ బ్యాంక్ ఎదుట సీపీఐ ధర్నా
చర్లపల్లి: దేశ వనరులను కాజేస్తున్న అదానీ ఆస్తులను జాతీయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్ డిమాండ్ చేశారు. ఏఎస్‌రావునగర్ డివిజన్ ఈసీఐఎల్‌లోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రధాని మోదీ కనుసన్నల్లోనే ఎల్ఐసీ నుంచి రూ.80 వేల కోట్లు, ఎస్బీఐ నుంచి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు అదానీ కంపెనీలో పెట్టారని ఆయన ఆరోపించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడు సతీశ్‌కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.