హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ, స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. దేశంలో ఆటవిక రాజ్యం సాగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులను లొంగదీసుకొనేందుకు వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుంటే, దానిని తట్టుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే పని చేయాల్సి వస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో మంత్రులు గంగుల కమలాకర్, సీహెచ్ మల్లారెడ్డిపై ఈడీ, ఐటీ దాడులు రాజకీయ ప్రేరేపితమేనని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని మగ్ధూంభవన్‌లో సీపీఐ నేతలు పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్, ఈటీ నర్సింహాతో కలిసి గురువారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని అని సాంబశివరావు విమర్శించారు. ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసులిస్తే.. బండి సంజయ్ ఎందుకు ఏడుస్తున్నారని ప్రశ్నించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సాయిబాబా, వరవరరావు వంటి వందల మందిని జైళ్లలో మగ్గేలా చేస్తే ఎందుకు కన్నీళ్లు పెట్టలేదని నిలదీశారు. బీఎల్ సంతోష్ ఎందుకు సిట్ ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఆయనేమైనా రాజ్యాంగానికి, వ్యవస్థకు అతీతుడా? అని నిలదీశారు. ఎంఎల్ఏల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెప్పిన బీజేపీ, ఆ కేసును సీబీఐకి ఇవ్వాలని పిటిషన్ ఎందుకు వేసిందని ప్రశ్నించారు. గత ఎనిమిదేండ్లలో ఈడీ మూడు వేలకుపైగా సోదాలు చేసిందని, అందులో ఒకటైనా నిరూపితమైందా? అని నిలదీశారు. ఈడీ సోదాలు చేసిన వ్యక్తుల్లో ఒకరైనా బీజేపీ నాయకులు ఉన్నారా? అని ప్రశ్నించారు.