హైదరాబాద్, హిమాయత్‌నగర్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): అమెరికా తీరుతో ప్రపంచంలో అశాంతి పరిస్థితులు నెలకొన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా ఇరాన్‌పై దాడికి తెగబడడం గర్హనీయమని మండిపడ్డారు.
ఇరాన్‌పై అమెరికా దాడిని నిరసిస్తూ.. మంగళవారం పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నారాయణగూడ వైఎంసీఏ కూడలి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షతో ప్రపంచ దేశాలను మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వీఎస్ బోస్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు గోవర్దన్ తదితరులు పాల్గొన్నారు.