మహబూబాబాద్ రూరల్, ఫిబ్రవరి 3: కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్‌సారథి మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో తమకు 10 నుంచి 12 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషంలో సీపీఐతో పొత్తు ఉండదని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి మహబూబాబాద్ పట్టణంలోని నామినేషన్ల ఉపసంహరణ కేంద్ర వద్ద నిరసన తెలిపారు. ఎమ్మెల్యే మురళీనాయక్ డౌన్‌డౌన్ అంటూ కార్యకర్తలు నినదించారు.
ఈ సందర్భంగా విజయ్ సారథి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఎమ్మెల్యే మురళీనాయక్‌ను భారీ మెజారిటీతో గెలిపించినట్టు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయని, ఈ క్రమంలో అనేకసార్లు సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమతో చర్చించినట్టు చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ఎండగడుతామన్నారు. ఆ పార్టీ సభ్యులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.