CPI-CPM | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. అధికార బీఆర్ఎస్తో తలపడలేని కాంగ్రెస్, బీజేపీలు.. అభ్యర్థుల కోసం తండ్లాడుతున్నాయి. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం) ఇప్పుడు కేవలం ఒకటి, రెండు సీట్లలో పోటీ చేసేందుకు పాకులాడుతున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేసిన సీపీఐ, సీపీఎం ఉనికిని కోల్పోయాయి. సీఎం కేసీఆర్ పలు ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో లెఫ్ట్ పార్టీలు ప్రజాక్షేత్రంలో పలుకుబడి, ఉనికి కోల్పోయాయి. రోజురోజుకు ప్రజలకు దూరమైన సీపీఐ, సీపీఎం.. ఇటీవల జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలికాయి.
కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఓటింగ్ ఉన్నా.. రాష్ట్రమంతా పట్టు ఉందని భ్రమింప చేయడానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. తొలుత అధికార బీఆర్ఎస్ సైతం అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి పని చేస్తామని సంకేతాలిచ్చింది. కానీ లెఫ్ట్ పార్టీల అలవిగానీ డిమాండ్లతో వారిని దూరం పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో లెఫ్ట్ పార్టీ నేతల నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ ఎన్నికలతోనైనా ఉనికిని కాపాడుకోవాలని తహతహలాడుతున్న కమ్యూనిస్టు పార్టీలు.. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. లెఫ్ట్ పార్టీలు కోరే సీట్లలో తామే బలంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రెండు పార్టీలు చేసిన డిమాండ్లను ఆమోదించే పరిస్థితిలో లేదని తెలుస్తున్నది. ఉభయ కమ్యూనిస్టులకు చెరో రెండు స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందన్న వార్తలొచ్చాయి. కానీ.. ఏయే సీట్లు కేటాయించాలన్న విషయమై క్లారిటీ లేదు. భద్రాచలం, పాలేరు, ఇబ్రహీంపట్నం, మిర్యాలగూడ స్థానాలను తమకు కేటాయించాలని సీపీఎం, కొత్తగూడెం, చెన్నూర్, మునుగోడు స్థానాల కోసం సీపీఐ పట్టుబడుతున్నాయి.
సీపీఎం అడిగిన భద్రాచలం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఇప్పుడు మిర్యాలగూడ, ఇబ్రహీంపట్నం సీట్లపై మార్క్సిస్టులు పట్టుబడుతున్నట్లు వినికిడి. మరోవైపు కొత్తగూడెంతోపాటు మునుగోడు కోసం సీపీఐ పట్టుదలగా ఉన్నదని సమాచారం. గతంలో లెఫ్ట్ పార్టీలు పెట్టే డిమాండ్లను అధికార ప్రతిపక్ష పార్టీలు విశ్వసించేవి. కానీ, ప్రజా బలం కోల్పోయిన లెఫ్ట్ పార్టీల డిమాండ్లను అధికార, విపక్ష పార్టీలు పట్టించుకోకపోవడంతో లెఫ్ట్ పార్టీల నేతల్లో అసహనం, అసంత్రుప్తి పెరుగుతున్నట్లు సమాచారం. ఒకటి, రెండు సీట్ల కోసం బేరసారాలు చేస్తున్నా.. ఒంటరి పోరాటం చేస్తామని లెఫ్ట్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి.