హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (CP CV Anand) స్పందించారు. గోదాం విషయంలో నిబంధనలు పాటించలేదని, అందులో ప్రమాద నివారణ చర్యలు ఏమీలేవని చెప్పారు. కార్మికులంతా నిద్రలో ఉన్నప్పుడు అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నదని చెప్పారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ పేలినట్లు 100కు ఫోన్‌కాల్ వచ్చిందని చెప్పారు. సిలిండర్ పేలడంతోనే మంటలు ఎక్కువగా వ్యాపించాయన్నారు.
కింద ఫ్లోర్లో తుక్కుసామాను వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని వెల్లడించారు. ఇద్దరు యువకులు పైనుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారని చెప్పారు. గాయాలైన వ్యక్తితో మాట్లాడితే పూర్తి సమాచారం వస్తుందని తెలిపారు. మృతులు బీహార్‌లోని చప్రా జిల్లాకు చెందినవారని వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. గోదాం యజమానికి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.