శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 02:13:17

రాష్ట్రంలో 178 మందికి కరోనా

రాష్ట్రంలో 178 మందికి కరోనా

  • జీహెచ్‌ఎంసీలోనే 143 కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మంగళవారం 178మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 143మంది ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 15 మంది, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 10 మంది, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, జగిత్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరికి పాజిటివ్‌గా తేలింది. కరోనా, ఇతర కారణాలతో ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 3,920 మందికి పాజిటివ్‌ రాగా, 148 మంది మరణించారు.1,742 మంది చికిత్స ద్వారా కోలుకుని ఇండ్లకు వెళ్లారు. 2,030 మంది చికిత్స పొందుతున్నారు. 

ఇద్దరు శిక్షణ ఐపీఎస్‌లకు కరోనా?

నేషనల్‌ పోలీస్‌ అకాడమి(ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న ఇద్దరు ఐపీఎస్‌ ప్రొబేషనరీ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. 130 మంది శిక్షణ ఐపీఎస్‌లు ఇటీవల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ కోసం వారివారి క్యాడర్‌ రాష్ర్టాలకు వెళ్లి.. ఇటీవలే తిరిగి అకాడమిలో రిపోర్టు చేశారు. వీరికి అకాడమి ఉన్నతాధికారులు కొవిడ్‌-19 పరీక్షలు చేయించగా, ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు తెలిసింది. వారిని అకాడమిలోనే క్వారంటైన్‌లోఉంచి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. 


ఇండ్లలో చికిత్సకు తగిన ఏర్పాట్లు: మంత్రి ఈటల 

కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయి లక్షణాలు లేనివారికి ఇంట్లోనే చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లుచేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. స్థానిక పీహెచ్‌సీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలోని వైద్యులు, నర్సులు, సిబ్బంది పరిశీలనలో వీరికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మంగళవారం కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐసీఎమ్మార్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే రాష్ట్రంలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మొదట 14 రోజులు చికిత్స అందించాక.. పరీక్షించి నెగిటివ్‌ వస్తే డిశ్చార్జి చేయాలని ఐసీఎమ్మార్‌ సూచించిందని గుర్తుచేశారు. 

ఆ తర్వాత పాజిటివ్‌ వచ్చినా వ్యాధి లక్షణాలు లేనివారికి పదిరోజులు చికిత్స అందించి మరోసారి పరీక్షించకుండా ఇండ్లకు పంపాలని పేర్కొన్నదని తెలిపారు. తాజాగా కరోనా వైరస్‌ తీవ్రత లేనివారికి, వ్యాధి లక్షణాలు లేనివారికి ఇండ్లలోనే ఉంచి చికిత్స అందించాలన్న ఐసీఎమ్మార్‌ సూచనను రాష్ట్రంలో అమలుచేస్తున్నట్టు ఈటల చెప్పారు. మృతిచెందినవారికి కొవిడ్‌ పరీక్షలు చేయాలనడం అశాస్త్రీయమని, మృతులందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యంకాదని ఆయన స్పష్టంచేశారు. కరోనా తో కాకుండా అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర కారణాలతో రాష్ట్రంలో రోజుకు వెయ్యిమంది మరణిస్తున్నారని, వారందరికీ కరోనా పరీక్షలు చేయలేమన్నారు. కరోనా బారినపడినవారికి గాంధీలో మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు.


logo