‘పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి’
-మహారాష్ట్రలో అజిత్‌పవార్ వర్గం ఎన్సీపీని చీల్చి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేరడంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి.
‘అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి సహేతుక సమయం అంటే ఎంత? మహారాష్ట్ర మాదిరిగా పదవీ కాలం పూర్తవడమా?’
– శుక్రవారం సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇవి
‘పార్టీ మారాలనుకునే ప్రజాప్రతినిధులు ముందుగా తమ పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి’
– కేరళ హైకోర్టు శనివారం చేసిన వ్యాఖ్యలు ఇవి
Defection | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపులపై ఇటీవల కోర్టులు చేస్తున్న వ్యాఖ్యలను గమనిస్తుంటే, తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలో చేరడంపై , అనర్హత పిటిషన్లపై స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయస్థానాలు గుర్రుగా ఉన్నాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. ఈ పరిణామాలను బట్టి రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావి స్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం
రాష్ట్రంలో గత ఏడాది మార్చిలో ఫిరాయింపులపర్వం మొదలైంది. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితర 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేయాలని నిరుడు మార్చి 18 నుంచి బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేస్తున్నది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్లపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును గత నవంబర్‌లో డివిజన్ బెంచ్ కొట్టివేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తేల్చాల్సిందేనని స్పీకర్‌కు స్పష్టంచేసింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లగా శుక్రవారం వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ‘సహేతుక సమయంలో నిర్ణయం తీసుకుంటారు’ అని స్పీకర్ కార్యాలయం తరఫు న్యాయవాది చెప్పగా.. ‘ఎంతకాలం? మహారాష్ట్రలో పార్టీ ఫిరాయింపుల మాదిరిగా చేస్తారా?’ అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
నోటీసులు ఇవ్వడానికే పది నెలల సమయం తీసుకుంటారా? అని నిలదీసింది. దీనిని బట్టే పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఏ స్థాయిలో అగ్రహంగా ఉన్నదో అర్థం అవుతున్నదని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు వారాల గడువు ఇస్తే వివరాలు కనుక్కొని చెప్తానని న్యాయవాది కోరగా.. ‘తెలుసుకొని చెప్పడానికి హైదరాబాద్ వెళ్లక్కర్లేదు. ఫోన్లో మాట్లాడి కూడా చెప్పవచ్చు’ అని వ్యాఖ్యానించడాన్ని బట్టి వీలైనంత త్వరగా ఈ కేసులను తేల్చేయాలని కోర్టు భావిస్తున్నదని అంటున్నారు. ఈ నెల 10న సుప్రీంకోర్టులో జరిగే విచారణ సందర్భంగా స్పీకర్ కచ్చితంగా తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుందని భావిస్తున్నారు. స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని గతంలో సుప్రీంతీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ ఏడాదిలోనే తెలంగాణలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే గుబులు మొదలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీ మారిన తర్వాత తమకు సరైన గుర్తింపు దక్కడం లేదన్న బాధ ఒకవైపు, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న టెన్షన్ మరోవైపు వేధిస్తున్నాయని వాపోతున్నారట. పార్టీ మారడంపై సొంత నియోజకవర్గాల ప్రజలు తిరగబడే పరిస్థితి ఉన్నదని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తే ఓటమి ఖాయమని సన్నిహితుల వద్ద చెప్తున్నారట. ఏదో ఆశించి పార్టీ మారితే రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యామని వాపోతున్నారని తెలిసింది.