నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ సాక్షిగా మంగళవారం సర్కార్ ఓవరాక్షన్‌కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు, నవీన్‌రెడ్డిని అరెస్టు చేసి నాంపల్లిలోని 1వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హారుపర్చారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని సైఫాబాద్ పోలీసు అధికారులు చేసిన ప్రయత్నం నీరుగారిపోయింది. రిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఇద్దరు ఎమ్మెల్సీలకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల తరఫున డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల మేరకు సత్యనారాయణ (పీపీ) కోర్టుకు వాదనలు వినిపించారు. నాంపల్లిలోని అన్ని కోర్టులకు చెందిన ప్రాసిక్యూటర్లు ఆయనకు మద్ద తు ప్రకటించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కులంపేరుతో దూషించారని ఎస్సీ,ఎస్టీతోపాటు 352బీఎన్ఎస్ సెక్షన్లను జోడించి ఇద్దరు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టుతోపాటు వారిని కోర్టు ఎదుట హాజరుపర్చారు.
డీసీపీ శిల్పవల్లి, నర్సయ్య (అసిస్టెంట్ డీసీపీ), మత్తయ్య (ఏసీపీ) సమక్షంలో రిమాండ్ రిపోర్టును నిందితులకు, కోర్టుకు సమర్పించారు. సుమారు 3 గంటలపాటు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ప్రకటించడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఏడేండ్లలోపు సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులో 41(ఏ) నోటీసులు ఎందుకివ్వలేదని మెజిస్ట్రేట్ శ్రీకాంత్‌బాబు పోలీసులను ప్రశ్నించారు. హర్నేశ్కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్, లలితాకుమారి తీర్పు లో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం ఏడేండ్లలోపు శిక్షలున్న కేసులన్నీంటికీ 35(3) బీఎన్ఎస్ కింద ఎందుకు నోటీసులు జారీ చే యలేదని జడ్జి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాల వాదనులు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ 20వేల చొప్పున ఇద్దరి జమానత్‌లను కోర్టుకు సమర్పించాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
పోలీసులు చేసిన రిమాండ్ అభ్యర్థనను తోసిపుచ్చి తమను విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో చివరకు ధర్మం, న్యాయమే గెలిచాయని వారు స్పష్టంచేశారు. మంగళవారం వారు మీడియా తో మాట్లాడుతూ.. తాము అరెస్ట్ అయిన క్షణం నుంచీ వెన్నంటి ఉంటూ, న్యాయపోరాటానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించిన పార్టీ కేటీఆర్, హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
శాసనసభ గేట్ నంబర్ 3వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులను అడ్డుకొని వారిపై భౌతిక దాడికి దిగి, మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా, అవమానకరంగా ప్రవర్తించారనే ఆరోపణలపై కేటీఆర్ సహా 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సైఫాబాద్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఖైరతాబాద్ పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎం బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావు, సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, కోవ లక్ష్మి, సబితాఇంద్రారెడ్డి, సంజయ్, విజయుడు, శంభీపూర్ రాజు, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి, మరికొందరిపై బీఎన్ఎస్ 121(1), 132, 74,79,351,352,353 అండ్ సెక్షన్ 3(5) కింద కేసు నమోదు చేశారు.