కొత్తగూడెం, సెప్టెంబర్ 30 : వినాయకుడి శోభాయాత్ర సందర్భంగా తమ పార్టీ కార్యకర్తలు పోరాల్ల శ్రీనివాస్, మంద గణేష్పై కొంతమంది వ్యక్తులు దాడికి పాల్పడినట్లు, ఇదేంటని అడుడగా తమపైనే కేసులు నమోదు చేసినట్లు, దాడి ఘటనను చట్టపరంగానే పోరాడుతామని బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకురాలు, కొత్తగూడెం 7వ డివిజన్ కార్పొరేటర్ సింధు తపస్వి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవరాం ఆమె వెల్లడించారు. సెప్టెంబర్ 26 రాత్రి గణేశ్ శోభాయాత్రను వీక్షిస్తున్న సమయంలో ‘‘మీరు బీఆర్ఎస్ కార్యకర్తలే కదా.. కార్పొరేటర్ సింధు తపస్వితో తిరుగుతుంటారుగా అంటూ కొంతమంది వ్యక్తులు దాడి చేయడంతో పాటు రాళ్లు రువ్వి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు తెలిపినట్లు ఆమె వెల్లడించారు.
విషయం తెలిసిన వెంటనే పట్టణ ఎస్ఐ నాగరాజుకు సమాచారం అందించి ఘటన స్థలానికి రావాలని కోరినట్లు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తాము అక్కడికి వెళ్లగా, కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి దుర్భాషలాడుతూ కార్యకర్తలపై రాళ్లతో దాడికి పాల్పడుతున్నట్లు కనిపించిందని చెప్పారు. ఎస్ఐ నాగరాజు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారని, గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించుకోవాలని సూచించారని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి తనపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఆవేదన కలిగించిందని సింధు తపస్వి తెలిపారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ మహిళా నాయకురాలిగా ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తున్నందుకే కేసులతో భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆమె అన్నారు. చట్టంపై, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని, ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు కలిగించినా తమ మనోధైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని, ప్రజా సమస్యలను లేవనెత్తుతూనే ఉంటానని, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ప్రజలకు అండగా నిలుస్తానని సింధు తపస్వి స్పష్టం చేశారు.