నాంపల్లి కోర్టులు, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించారని పేర్కొంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో ఈ విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్టు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం ప్రకటించింది.
ఇప్పటికే కోర్టు ఈ కేసులో కేటీఆర్‌తోపాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. మంత్రి సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీవీ చానళ్లు, పత్రికలు, సోషల్ మీడియాలో కథనాలు రావడంతో ఆ క్లిప్పింగులను పెన్‌డ్రైవ్‌లో నిక్షిప్తం చేసి కేటీఆర్ కోర్టుకు సమర్పించారు. వీటిపై మంత్రి సురేఖ వివరణ ఇచ్చిన తర్వాత కోర్టు తన తీర్పును వెలువరించనున్నది.