నాంపల్లి కోర్టులు, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): నల్లగొండ జిల్లా పెద్దవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ఐపీసీలోని 269, 188 సెక్షన్లతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం కింద నిరుడు నమోదైన ఈ కేసులో సీఎం రేవంత్ లేదా ఆయన తరఫు న్యాయవాది నవంబర్ 6న విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో స్పష్టం చేసింది.
రేవంత్‌తోపాటు మరో నిందితుడు టీ చంద్రశేఖర్‌రెడ్డిని కూడా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. ఇంతకాలం ఈ కేసులో సమన్లు జారీ చేయకుడా అలసత్వం వహించిన సదరు పోలీస్ స్టేషన్ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కాగా, ఇదే పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో అక్టోబర్ 10న విచారణకు హాజరు కావాలని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయనకు సమన్లు పంపాలని ఉత్తర్వులు జారీ చేసింది.