ఖిలావరంగల్, ఫిబ్రవరి 04 : మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జనరల్ అబ్జర్వర్ కిల్లు శివకుమార్ నాయుడు సమక్షంలో కలెక్టర్ చాంబర్లో నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో పాటు జనరల్ అబ్జర్వర్ ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించి, పారదర్శకంగా నిర్వహించాల్సిన విధానాలపై అధికారులకు తగిన సూచనలు చేశారు.
జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ విధుల కోసం రెండవ ర్యాండమైజేషన్ ద్వారా మొత్తం 400 మంది సిబ్బందిని కేటాయించారు. ఇందులో 80 మంది ప్రిసైడింగ్ అధికారులు, 80 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 240 మంది ఇతర పోలింగ్ అధికారులు ఉన్నారు. పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు స్థానికేతర సిబ్బందిని విధులకు ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ఆర్డీఓ సుమ, డీపీవో కల్పన, డీబీసీడీవో పుష్పలతతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.