నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 15 (నమస్తే తెలంగాణ) : బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి మీడియాలో జరిగే ప్రసారాలు, ప్రచురణల్లో ఆయన తండ్రి, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును ఉపయోగించరాదని నాంపల్లి కోర్టు ఆదేశించింది. తన పరువు ప్రతిష్టలకు భంగం కల్పించే విధంగా మీడియాలో జరుగుతున్న ప్రసారాలను నిలిపివేయాలని కోరుతూ బండి సంజయ్ హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంతవరకు మీడియాలో ప్రసారాలు నిలిపివేయాలని శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను తక్షణం తొలగించాలని ఆదేశించింది.
తనపై మీడియాలో దుష్ర్పచారం కొనసాగుతున్నదని బండి తన పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రిగా తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా మీడియాలో, పత్రికల్లో కథనాలు ప్రచురితమవుతున్నాయని తెలిపారు. తన పేరుతోపాటు ఫొటోలు, వీడియాలు వాడకుండా మీడియాను నియంత్రించాలని పిటీషన్లో తెలిపారు. ఇప్పటివరకు సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్, ప్రముఖ టీవీల్లో, పత్రికల్లో ప్రచురితమైన వార్తలను తొలగించేలా ఆదేశాలు జారీచేయాలని కోరారు. మీడియాలో తనకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేస్తున్నారని, సామాజిక మాద్యమాల్లో ప్రసారమైన కథనాలకు చెందిన వీడియోలను కోర్టుకు సమర్పించారు. తన కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం కావడంపై కేసు నమోదైందని తెలిపారు. మేడ్చల్ జిల్లా బాలల సంక్షేమ కమిటీ చైర్పర్సన్ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు.