నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 3 (నమస్తే తెలంగాణ): మహాన్యూస్‌పై దాడి కేసులో అరెస్టు చేసిన నిందితులను 24 గంటల్లోపు కోర్టు ఎదుట హాజరుపర్చలేకపోవడానికి గల కారణాలను తెలియజేయాలని నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్, జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు గురువారం వారికి షోకాజ్ నోటీసులు జారీచేసింది.
ఈ కేసులో నిందితులను జూన్ 29న అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు 30వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారని వారి తరఫు న్యాయవాది కోర్టు తెలిపారు. ఈ కేసులో రెండో ముద్దాయి రామచర్ల నర్సింహులు అలియాస్ నర్సింగ్, మూడో ముద్దాయి జంగయ్యను టాస్క్‌ఫోర్స్ వెస్ట్‌జోన్ పోలీసులు అంతుచూస్తామని భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. సెక్షన్ 109 (1), 238 బీఎన్ఎస్ ఈ కేసుకు వర్తించవని, మిగతా సెక్షన్లు ఏడేండ్లలోపు శిక్షలున్నవేనని తెలిపారు.