హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు మోహన్‌బాబుకు హైకోర్టులో చుకెదురైంది. విలేకరిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఈ మేరకు జస్టిస్ కే లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మనువడిని కలిసేందుకు ఇటీవల దుబాయ్ వెళ్లిన మోహన్‌బాబు.. అక్కడి నుంచి తిరిగొచ్చి ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. గుండె, నరాల సమస్యలతో బాధపడుతున్న మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనిపై పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 10న జల్పల్లిలోని నివాసం వద్ద విలేకరిపై దాడికి పాల్పడిన మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైందని, ఆయనపై తీవ్రమైన అభియోగాలు ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం మోహన్‌బాబు పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.