ఈ ఫొటో చూడండి! ఇది రాజేందర్‌నగర్ నియోజకవర్గం కొత్వాల్‌గూడ పరిధిలోని భూ మి. ఒకటీ అరా కాదు!! ఏకంగా 52 ఎకరాలు. ఇది ప్రభుత్వ భూమే. కానీ, బడాబాబులు ఆక్రమించారు. డాక్యుమెంట్లు చూపి న్యాయస్థానాలను ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉండగానే భూములు చేతులు మారాయి. కోట్లాది రూపాయల లావాదేవీలూ జరిగాయి. ఫంక్షన్‌హాళ్లు, ఇతరత్రా నిర్మాణాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కోర్టు.. ఈ 52 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, ప్రైవేటు వ్యక్తులది కాదని నిరుడు డిసెంబర్లో తీర్పు చెప్పింది. ఆ వెంటనే ‘కేసు గెలిచాం.. భూమిని కాపాడేందుకు చర్యలు తీసుకోండి!’ అంటూ ప్రభుత్వ న్యాయవాది రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. అనంతరం నెల క్రితం కోర్టు తీర్పు కాపీ కూడా అధికారులకు చేరింది. కానీ, ఆ భూమి వంక అధికారులు కన్నెత్తి చూసిన దాఖల్లాలేవు. కేవలం ఒక బోర్డు మాత్రమే అది కూడా నిర్మాణదారులకు ఇబ్బంది కలగకుండా ఒక పక్కగా పాతేసి చేతులు దులుపుకొన్నారు. ‘ఆ భూమిని స్వాధీనం చేసుకోరా?’ అని ‘నమస్తే తెలంగాణ’ ప్రశ్నిస్తే.. ప్రతి ఒక్క అధికారి చెప్పే సమాధానం ఒక్కటే ‘ఉన్నతాధికారిని అడగండి’ అని!
Congress Govt | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మే 1 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని వట్టినాగులపల్లి సర్వే నంబరు 132 ప్రభుత్వ భూమిలో దశాబ్దాల క్రితం నిరుపేదలకు ఒక్కొక్కరికి 60 గజాల మేర పట్టాలు ఇచ్చారు. అది పోను మిగిలిన భూమిపై కొంతమంది రాజకీయ నాయకులు కన్నేశారు. ఎంతోకొంత ఇస్తే ఇల్లు కట్టుకునేందుకు సహకరిస్తామంటే, ఒక నిరుపేద కుటుంబం.. సొంతనీడ దొరుకుతుందన్న ఆశతో.. కూలి పని చేయగా వచ్చిన సొమ్ములోనే కొంత మిగుల్చుకొని, బంగారం అమ్మి 60 గజాల్లో చిన్న గది నిర్మించుకొని జీవిస్తున్నది. రాజకీయ నాయకులు విక్రయించి, డబ్బులు తీసుకున్నప్పుడు గానీ, ఆ చిన్న గది నిర్మాణం జరుగుతున్నప్పుడు గాని అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడరు.
కానీ, ప్రభుత్వ పెద్దలు ‘చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చెరసాలే…’ అంటూ ప్రకటనలు చేసినప్పుడు మాత్రం అధికారులు ఇలా బుల్డోజర్లతో బయలుదేరుతారు. నిరుపేదల ఇండ్లను నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తారు. ఇంట్లో ఉన్న సామాన్లు బయటపడేసి మరీ కూల్చివేస్తారు. ఆ అభాగ్యులు ఎక్కడికి పోవాలి? ఎక్కడ తలదాచుకోవాలి? అనేది ఏ మాత్రం పట్టించుకోరు. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామంటూ మీడియాకు ఫొటోలు, ప్రకటనలు విడుదల చేస్తారు. ఆ భూమిని కాపాడామంటూ గొప్పలు చెప్పుకొంటారు. నెల రోజుల క్రితం వట్టినాగులపల్లిలో ఈ కూల్చివేతలు జరిగాయి.
రంగారెడ్ది జిల్లా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామంలోని సర్వే నంబర్ 54లో 270.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో అత్యధిక భాగం పలు ప్రజా అవసరాలకు వినియోగించారు. ఏపీ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీకి 30 ఎకరాలు, హుడాకు 75 ఎకరాలు, పర్యాటక శాఖకు 50 ఎకరాలు, రైల్వే వర్క్‌షాప్‌కు 12 ఎకరాలు కేటాయించారు. కొంతభూమి ఔటర్ రింగ్ రోడ్డులో పోయింది. హెచ్ఎండీఏకు కొంతకాలం క్రితం 45 ఎకరాలు ఇవ్వగా, గతంలో ఇచ్చిన 75 ఎకరాలు కలుపుకొని కేసీఆర్ ప్రభుత్వం రూ.180 కోట్లతో కొత్వాల్‌గూడ ఎకో టూరిజం పార్క్‌ను అభివృద్ధి చేసింది. మరో ఐదెకరాల్లో చౌడమ్మ దేవాలయం, ఎకరంలో హనుమాన్ దేవాలయం ఉండగా, 15 గుంటలను శ్మశానవాటికకు కేటాయించారు. ఇవన్నీ పోను 52 ఎకరాల భూమి ఉన్నది.
ఈ విస్తీర్ణం 26 మంది ప్రైవేటు వ్యక్తుల పేరిట ఉండగా, దీనిపై ఉమ్మడి ఏపీ నుంచి కోర్టులో వివాదం ఉంది. ప్రైవేటు వ్యక్తులు తమ పేరిట ఉన్న 52 ఎకరాలకు పాసు పుస్తకాలు జారీచేయాలని 2006లో రెవెన్యూ శాఖను ఆశ్రయించగా అధికారులు తిరస్కరించారు. దీంతో వారు రెండో అదనపు జూనియర్ సివిల్‌కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకొని ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. కొందరు వ్యాపారపరంగా పలువురికి లీజుకు ఇచ్చుకోగా, మరికొందరు చుట్టూ ప్రహరీ నిర్మించుకున్నారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ అప్పీలుకు వెళ్లింది. ఈ మేరకు 2018లో రంగారెడ్డి జిల్లాకోర్టులో దాదాపు 20 వరకు దావాలు దాఖలయ్యాయి.
సుదీర్ఘ విచారణ తర్వాత ‘ఈ భూమి ప్రభుత్వానిదే’ అంటూ రంగారెడ్డి జిల్లా కోర్టు నిరుడు డిసెంబర్ 3న తీర్పు ఇచ్చింది. ప్రైవేటు వ్యక్తులు సమర్పించిన ఆధారాలు సరిగ్గా లేవని, ఆ భూములు తమవేనని నిరూపించేందుకు సరైన డాక్యుమెంట్లు సమర్పించలేకపోయారని కోర్టు స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఆ భూమి స్వాధీనానికి అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేదలపై విరుచుకుపడే అధికారులు బడాబాబుల విషయంలో స్పందించకపోవడం వెనక ఆంతర్యమేమిటో బహిరంగ రహస్యమేనని పలువురు ఆరోపిస్తున్నారు. పైగా ఎగువ కోర్టులను ఆశ్రయించి స్టే తెచ్చుకోవాలని సదరు వ్యక్తులను కొందరు అధికారులే సూచిస్తుండటం గమనార్హం.