హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ హయాంలో అగ్నిమాపకశాఖ మెరుగైన పనితీరు కోసం ప్రవేశపెట్టిన డైలీ సర్వీసెస్ రిపోర్ట్ (డీఎస్ఆర్)కు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ అగ్నిమాపకశాఖ ఫైర్ వెబ్సైట్లో నిర్వహిస్తున్న డీఎస్‌ఆర్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని స్టాండింగ్ ఫైర్ అడ్వైజరీ కౌన్సిల్ (ఎస్‌ఎఫ్‌ఏసీ) సూచించింది.
ఎత్తయిన భవనాల్లో ఫైర్ ఆడిటింగ్ కోసం థర్డ్ పార్టీ నుంచి ఫైర్ ఆడిటర్లను ఎంపిక చేసుకునే విధానంపై రాష్ట్ర ఫైర్ డీజీ నాగిరెడ్డి అధ్యక్షత ఏర్పడిన సబ్‌కమిటీ నివేదికలను ఆమోదించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఈ నెల 9 నుంచి జరుగుతున్న 45వ ఎస్‌ఎఫ్‌ఏసీ జాతీయ స్థాయి సమావేశం శుక్రవారంతో ముగిసింది. దేశవ్యాప్తంగా అగ్నిమాపక శిక్షణకు అనువైన ప్రదేశాల గుర్తింపు, జాతీయస్థాయిలో అగ్నిమాపక సేవల అనుసంధానంపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కౌన్సిల్ సమావేశంలో డీఆర్ఎస్ ప్రత్యేకంగా నిలిచింది. ఈ డీఎస్‌ఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కఠినంగా అమలు చేసింది.