హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో ప్రవేశపెట్టే బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మీడియాకు లీకులు ఇస్తుండటంపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏదైనా బిల్లును సభలో ప్రవేశపెట్టకముందు దానికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. భూభారతి చట్టం అమల్లోకి రాకముందే దానిపై పేపర్లలో ప్రకటనలు వచ్చాయని, ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని విపక్ష సభ్యులు మండలి చైర్మన్ దృష్టి తీసురావడంతో.. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రొటోకాల్స్పై కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలని, ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు చేయాలని ప్రభుత్వానికి తెలిపారు.
రెవెన్యూ గ్రామాలు పెరుగుతయా: ఎమ్మెల్సీ శేరి
రాష్ట్రంలో భూభారతి చట్టం వస్తున్న క్రమంలో రెవెన్యూ గ్రామాల సంఖ్యను పెంచే అవకాశాలు ఉన్నాయా. ఈ మేరకు రీఆర్గనైజేషన్ ఏమైనా చేస్తారా? నూతన రెవెన్యూ చట్టంలో అనుభవదారు కాలం ప్రత్యేకంగా పెట్టడం కరెక్ట్ కాదు.
భూభద్రత కోసమే ధరణి : ఎమ్మెల్సీ తాతా మధు
రాష్ట్రంలో భూముల భద్రత కోసమే కేసీఆర్ ధరణి విధానం తీసుకొచ్చారు. భూములన్నీ డిజిటలైజేషన్ చేశారు. దీంతో అందరి భూములు భద్రంగా ఉన్నాయి. భూభారతితో ప్రజల భూముల కోసం సాఫ్ట్వేర్ మారుస్తున్నారా?
కౌలుదారు కాలం సరికాదు: ఎంసీ కోటిరెడ్డి
భూభారతి చట్టంతో రైతులకు ఎంతవరకు లాభం జరుగుతది. ఈ చట్టంలో కౌలుదారుడికి ప్రత్యేక కాలం పెట్టడం సరికాదు. జాగీర్దారు విధానం రద్దు, భూ హక్కుల్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? పహాణీలు ఏ విధంగా చేర్చబోతున్నారు?