నల్గొండ : వచ్చే వేసవి(Summer)లో మంచినీటి సమస్య(Water shortage) వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ విషయంలో చొరవ చూపాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy) అన్నారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయం కార్యాలయంలో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం చొర తీసుకోవాలన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు.
మిషన్ భగీరథ లో కాంట్రాక్టర్లు చేసిన పనులకు పేమెంట్లు కూడా త్వరగా చెల్లించాలన్నారు. ఈ సంక్రాంతి రైతులకు అనుకూలంగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు లేదని ఏఎంఆర్పీకి నీరు రావడంలేదని చెప్పారు . ఈ సంవత్సరం ప్రతి పంట కూడా బాగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి నల్గొండ లేదా భువనగిరి ఏదో ఒక నియోజకవర్గ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలు గెలుస్తామని అనడం అసమంజసంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థను అయినా చులకనగా చూడరాదని, సీఎం రేవంత్ రెడ్డి శాసనమండలి పై చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు చర్యలు సరికావన్నారు. రేవంత్ రెడ్డి ఒక నెల పరిపాలనపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని అన్నారు. ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేశారు.