మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు దేశ రాజకీయాల ఆవశ్యకత కోసం బీఆర్ఎస్గా (BRS) మారింది మండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట్టవ్యతిరేకమైన చర్యలకు చరమగీతం పాడాలని సీఎం కేసీఆర్ (CM KCR) దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తమవ్వాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభకు గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah).. చేవెళ్ల సభలో ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తాం అనడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ముస్లిం ప్రజలు భారతదేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. వారి అభివృద్ధికి కృషిచేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని నిలదీశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు రాష్ట్ర అభివృద్ధిపై యావలేదని, కేవలం అధికారంలోకి రావాలి, దోచుకొని తినాలి అనేదే వారి కుట్ర విమర్శించారు. తెలంగాణ ప్రజలు మతతత్వ పార్టీని ఎప్పటికీ విశ్వసించరని స్పష్టంచేశారు. బీజేపీ తెలంగాణలో ఉనికిలోనే లేదని, వాళ్లు పగటి వేశగాళ్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, కష్టాల్లో ఉన్న ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆగడం లేదన్నారు. సీఎం నేనంటే నేనని డజన్ల కొద్ది మంది కొట్టుకుచస్తున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న ఎన్నికల్లో మిర్యాలగూడలో సీపీఎం పోటీ చేస్తోందనడంలో వాస్తవం లేదన్నారు. ఈ నాలుగు నెలలు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని, పార్టీ బాగుంటేనే మనం బాగుంటామనేది అందరూ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని సూచించారు.