నల్లగొండ : విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన రెసిడెన్షియల్ స్కూల్స్‌ని ముఖ్యమంత్రి కేసీఆర్ కార్పొరేట్ స్కూల్స్‌కి దీటుగా తయారు చేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ పట్టణం శ్రీనివాస నగర్ లోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గతంలో 228 ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలను 1001కి పెంచి, విద్యార్థులకు ఉన్నతమైన విద్యని అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. గతంలో ఈ పాఠశాలకు ఎంపీగా స్పోర్ట్స్ మీట్‌కి వచ్చాను. నేడు శాసన మండలి చైర్మన్ హోదాలో మళ్లీ వచ్చాను. చాలా సంతోషంగా ఉందన్నారు. క్రీడలు అనేవి విద్యార్థులకు చాలా అవసరం. ఆటలు శారీరక దృఢత్వాన్ని,మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి.
ఆటలో అయినా, జీవితంలో అయిన గెలుపు ఓటములు చాలా సహజం అన్నారు. గెలవాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఉన్నతమైన విద్యను అందిస్తూ విద్యార్థులకు గొప్ప భవిష్యత్ ను రెసిడెన్షియల్ పాఠశాలలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.
తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ లలో పని చేస్తున్న అధ్యాపక సిబ్బంది కూడా గొప్పగా పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ విజయసింహా రెడ్డి, జిల్లా రైతు బంధు చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరళ, ప్రిన్సిపల్ నర్సింహా రెడ్డి,ఆర్ సి. ఓ షాకిన తదితరులు పాల్గొన్నారు.