హైదరాబాద్, నవంబర్ 4(నమస్తే తెలంగాణ) : రానున్న శాసనమండలి సమావేశాలను అసెంబ్లీ పక్కనే ఉన్న భవనంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు అనుగుణంగా భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో మండలి భవన పునర్నిర్మాణ పనులను సెక్రటరీ నరసింహాచార్యులు, ఆర్అండ్బీ, అగాఖాన్ సంస్థ ప్రతినిధులతో కలిసి సుఖేందర్రెడ్డి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మండలి నూతన సమావేశ ప్రాంగణాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పనుల్లో జాప్యం జరుగకుండా త్వరితగతిన పూర్తిచేసి అప్పగించాలని నిర్మాణ సంస్థలకు సూచించారు.