హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): పత్తి కొనుగోళ్లకు సంబంధించి ఏర్పడుతున్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలపై జిన్నింగ్ మిల్లుల అభ్యంతరాల నేపథ్యంలో ఒకటి, రెండు నిబంధనల్లో కొంతమేర సడలింపు ఇచ్చి.. మిగిలిన నిబంధనలను యథావిధిగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనడం లేదని తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర అధికారులు కేంద్రంతో ఈనెల 1న చర్చలు జరిపారని, మరోసారి సోమవారం చర్చలు జరుపుతారని వెల్లడించారు. అధిక వర్షాల వల్ల రైతులు అనుకున్నంత మేర దిగుబడులు లేవని, ఈ సందర్భంలో రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంతటివారినైనా ప్రభుత్వం ఉపేక్షించదని, వచ్చేవారం ఎలాగైనా కొనుగోళ్లు చేయాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు.